క‌రోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

19-04-2021 Mon 11:21
advertisement

క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ల‌భిస్తోన్న వ్యాక్సిన్లలో చాలా టీకాలు ఇటువంటివే. అయితే, క‌రోనా బారి నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి, అటువంటి వారు ఒక్క  డోసు వ్యాక్సిన్ తీసుకుంటే చాలని, క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని అమెరికాలోని సెడార్స్‌-సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్ ఓ అధ్య‌య‌నంలో తేల్చింది.

దాదాపు 1,000 మందితో నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో క‌రోనా నుంచి కోలుకున్న వారితో పాటు ఆ వైర‌స్ బారిన ప‌డ‌ని వారు ఉన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు టీకా ఇవ్వ‌గానే వారిలో రోగ‌నిరోధక శ‌క్తి చాలా మెరుగైన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

మ‌రోవైపు, క‌రోనా సోక‌ని వారిలో రెండు డోసులు ఇచ్చినప్ప‌టికీ వారిలో అంత‌గా మార్పులు రాలేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొర‌త ఉంది. క‌రోనా నుంచి కోలుకున్న వారికి ఒక డోసు మాత్రమే ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లు మిగిలిపోతాయ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ ప‌రిశోధ‌కులు అంటున్నారు.

సాధార‌ణంగా వైర‌స్  నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్ప‌త్తి అయి కొన్నాళ్ల‌కు త‌గ్గిపోతాయి. మ‌ళ్లీ వైర‌స్ శ‌రీరంలోకి చేరితే మ‌ళ్లీ అవి క్రియాశీల‌కంగా మార‌తాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ వైర‌స్‌ను గుర్తు పెట్టుకుని అది శ‌రీరంలో చేర‌గానే పోరాడుతుంది. ఈ ఏడాది  ఫిబ్ర‌వ‌రి నుంచి ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇట‌లీ, జ‌ర్మ‌నీలాంటి ప‌లు దేశాలు క‌రోనా నుంచి కోలుకున్న వారికి  రెండు డోసుల వ్యాక్సిన్‌లో కేవ‌లం ఒక డోసే ఇస్తున్నాయి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement