'నీట్'‌ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా

15-04-2021 Thu 19:34
advertisement

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం(ఏప్రిల్‌ 18) జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ గురువారం సాయంత్రం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. పరీక్ష నిర్వహించబోయే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. వైద్య విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

అంతకుముందు పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ రోగుల చికిత్సలో పాల్గొంటున్న ఎంబీబీఎస్‌ వైద్యులు భౌతికంగా పరీక్షలకు హాజరుకావడం వల్ల తీవ్ర ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల రద్దు చేసిన సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక పరీక్షలు, 12 వ తరగతి పరీక్షల వాయిదా వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement