2 ఓవర్ల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన రస్సెల్... ముంబయి 152 ఆలౌట్

13-04-2021 Tue 21:34
advertisement

కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ బంతితో విజృంభించిన వేళ బలమైన ముంబయి జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. రస్సెల్ 2 ఓవర్ల వ్యవధిలో 5 వికెట్లు తీయడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబయి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (2) ఆరంభంలోనే అవుట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ జోడీ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. 36 బంతులాడిన సూర్యకుమార్ యాదవ్ 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు సాధించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో, స్కోరు వేగం మందగించింది.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ (1), రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరారు. చివర్లో బ్యాట్లు ఝుళిపించాల్సిన స్థితిలో రస్సెల్ మ్యాజిక్ మొదలైంది. ఇన్నింగ్స్ 18 ఓవర్ లో బంతిని అందుకున్న రసెల్... తొలుత పొలార్డ్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో మార్కో జాన్సెన్ ను కూడా వెనక్కి పంపాడు. అనంతరం ఇన్నింగ్స్ చివర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన రసెల్... ఈసారి మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వరుస బంతుల్లో కృనాల్ పాండ్య, షకీబ్ అల్ హసన్ లను అవుట్ చేసి హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు.

అయితే, రాహుల్ చహర్ హ్యాట్రిక్ బాల్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత బంతికే చహర్ అవుట్ కావడంతో రసెల్ ఖాతాలో ఐదో వికెట్ చేరింది.. అటు, ముంబయి ఇన్నింగ్స్ కు తెరపడింది. మొత్తమ్మీద 2 ఓవర్లలో 15 పరుగులిచ్చిన రసెల్ 5 వికెట్లు సాధించాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement