ఎన్టీయే నుంచి వైదొలగిన మరో ప్రాంతీయ పార్టీ

13-04-2021 Tue 19:36
advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి మరో ప్రాంతీయ పార్టీ నిష్క్రమించింది. గోవాకు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్ పీ) నేడు ఎన్డీయే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు గోవాలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నందుకు నిరసనగానే తాము వైదొలగుతున్నట్టు జీఎఫ్ పీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్డీయే చైర్మన్ అమిత్ షాకు లేఖ రాశారు.

గోవా ప్రయోజనాలను కాపాడడంలో ఎన్డీయే దారుణంగా విఫలమైందని విమర్శించారు. గోవా ప్రజలు సొంత రాష్ట్రంలో పరాయివాళ్లలా మారిపోయారంటూ అందుకు బీజేపీ విధానాలే కారణమని ఆరోపించారు. గోవా వ్యతిరేక విధానాలను పునరావృతం చేస్తూ, కొందరికి మేలు చేసేలా, మరెందరికో నిరాశ కలిగించేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

హిందువుల పండుగ గుడీ పడ్వా సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎఫ్ పీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న తీర్మానానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులందరి మద్దతు లభించింది. కాగా, ఎన్డీయే నుంచి ఇప్పటికే అకాలీదళ్, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ దూరం జరిగిన సంగతి తెలిసిందే.

advertisement

More Flash News
advertisement
..more
advertisement