ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అడ్డూ అదుపూ లేని కరోనా!

12-04-2021 Mon 19:31
advertisement

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గత పక్షం రోజుల్లో కేసుల సంఖ్య దాదాపు రెండింతలయ్యింది. అసోం, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు నుంచే ఎన్నికల హడావుడి, ప్రచారం కార్యక్రమాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 26న ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీల హంగామా ఊపందుకుంది. దీని మూలంగా గత 14 రోజుల్లో రోజువారీ కేసుల్లో 300 శాతం వృద్ధి నమోదైంది.

అన్నింటికంటే తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌. అక్కడ కేసుల సంఖ్య 378 శాతం పెరిగింది. గత 14 రోజుల్లో 30,230 కొత్త కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 27న తుది విడత పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉష్ణోగ్రతలు తనిఖీ చేయడం, శానిటైజర్లు అందించడం వంటి కరోనా నియమాలు పాటిస్తున్నప్పటికీ.. ప్రచారంలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. కొవిడ్‌ నిబంధనలు పాటించనట్లైతే.. అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్‌ల ప్రచారంపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.

ఇక అసోంలో కొత్త కేసుల సంఖ్య 331 శాతం పెరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సైతం నిర్లక్ష్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. అక్కడ కేసుల సంఖ్య 175 శాతం పెరిగింది. తమిళనాడులో అయితే కేసుల సంఖ్య 173 శాతం ఎగబాకింది. అలాగే, కేరళలో కొత్త కేసులలో 84 శాతం పెరుగుదల కనిపించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement