ఏనాడూ బొట్టు పెట్టుకోని వ్యక్తి.. తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుంటున్నారు: సునీల్ దేవధర్ పై పేర్ని నాని వ్యంగ్యం

12-04-2021 Mon 17:09
advertisement

ఒక తండ్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ కు రాజకీయాలనే కాకుండా, కనీస సంస్కారాన్ని కూడా నేర్పించలేకపోయారని విమర్శించారు. టీడీపీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి చిన్న కార్యకర్త వరకు జూనియర్ ఎన్టీఆర్ రావాలని అంటున్నారని చెప్పారు. తిరుపతి ప్రజలు కరోనా బారిన పడినా పర్వాలేదు అనే విధంగా చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ స్వార్థాన్ని కూడా పక్కనపెట్టి తిరుపతి ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

తిరుపతి ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారని... తిరుపతికి వచ్చి ప్రజలకు నడ్డా ఏం చెపుతారని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ కు యం.ధర్మరాజు ఎంఏ సినిమాలో పాత్రకు ఎలాంటి తేడా లేదని అన్నారు. సునీల్ దేవధర్ పెట్టుకున్నది నామాలా? లేక రాష్ట్రానికి పెట్టబోయే పంగనామాలా? అని ప్రశ్నించారు. గతంలో ఏనాడూ బొట్టు పెట్టుకోని సునీల్ దేవధర్... తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుంటున్నారని అన్నారు.

ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించని బీజేపీ నేతలు... ఇప్పుడు మతం కార్డును వాడుకుని లబ్ధి పొందాలనుకుంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. మత విద్వేషాలను అజెండాగా తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.  తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ 22 నెలల పాలనకు రెఫరెండం అని అన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement