భారత్ లో 'స్పుత్నిక్ వి' కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్

12-04-2021 Mon 16:21
advertisement

భారత్ లో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్న నేపథ్యంలో రష్యా తయారీ  స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సిఫారసులను పరిశీలించిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది.

అసలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్ తీసుకువచ్చింది రష్యానే. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు రష్యాలో ఎప్పుడో అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. తాజాగా ఈ వ్యాక్సిన్ ను భారత్ లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. భారత్ లో ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు భారత్ లోనే ఉత్పత్తవుతున్నాయి. అయితే, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నారు.

భారత్ లో స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ లో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు 10,45,28,565 డోసులను ప్రజలకు అందించారు.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేయగా, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేస్తోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement