ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ తొలి మ్యాచ్... బెంగళూరుదే గెలుపు

09-04-2021 Fri 23:30
advertisement

ఐపీఎల్ 14 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 160 పరుగుల లక్ష్యాన్ని చివరిబంతికి ఛేదించింది. బెంగళూరు జట్టులో విధ్వంసక వీరుడు ఏబీ డివిలియర్స్ 48 పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 39, కెప్టెన్ విరాట్ కోహ్లీ 33 పరుగులు సాధించారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, కృనాల్ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబయి జట్టుకు తొలిసారి ఆడతున్న క్రిస్ లిన్ 49 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

ఆపై లక్ష్యఛేదనలో బెంగళూరు వాషింగ్టన్ సుందర్ (10) వికెట్ ను త్వరగానే కోల్పోయినా... కెప్టెన్ కోహ్లీ, మ్యాక్స్ వెల్ జోడీ వేగంగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అయితే వీరిద్దరూ 5 పరుగుల తేడాతో వెనుదిరగడంతో బెంగళూరు స్కోరు నిదానించింది. ఈ దశలో బెంగళూరు విజయానికి 18 బంతుల్లో 34 పరుగులు అవసరం కాగా... స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ సిక్సర్లు, ఫోర్లతో జట్టును విజయం ముంగిట నిలిపాడు. చివర్లో డివిలీర్స్ రనౌటైనా హర్షల్ పటేల్ విన్నింగ్ రన్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement