కలియుగ వింత... గర్భవతైన మహిళకు మళ్లీ గర్భం!

09-04-2021 Fri 10:18
Advertisement 1

ఈ ఘటన వింతల్లోకే వింత. కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతాయని నమ్మేవారంతా దీని గురించి విని అవాక్కవ్వాల్సిందే. గర్భంతో ఉన్న ఓ మహిళ, మరో గర్భం దాల్చడంతో పాటు, పండంటి కవలలకు జన్మనివ్వడమే ఈ వార్త. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై 'వాషింగ్టన్ పోస్ట్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వివరాల్లోకి వెళితే...

రెబెక్కా రాబర్ట్స్, అతని భాగస్వామి చాలా కాలంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటూ, పిల్లలు కావాలన్న తమ కలను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో, ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు తన భార్య నెల తప్పిందన్న అనుమానంతో, ఇంట్లోనే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకోగా, పాజిటివ్ రిపోర్టు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకపోయింది. అయినా వారికి అనుమానమే.

తొలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేంత వరకూ వారు తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న విషయాన్ని నమ్మలేదు. సోనోగ్రామ్ స్క్రీన్ లో తమ బిడ్డను చూసుకుని, ఆపై కడుపులోని బిడ్డ అవయవాలు సక్రమంగా ఎదుగుతున్నాయని తెలుసుకుని ఆనందించారు.

"నాకు చాలా బాగా గుర్తుంది. తొలి స్కాన్ తరువాత నేను చాలా అనందంగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాను" అని చెప్పిన ఇంగ్లండ్, విల్ట్ షైర్ వాసి, 39 ఏళ్ల రాబర్ట్స్ మరో 12 వారాల తరువాత తాను షాక్ నకు గురయ్యే వార్తను వినాల్సి వచ్చిందని అన్నారు. రెండోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కు వెళ్లిన వేళ, తన భార్య కడుపులో మరేదో ఉందని, అది మరో బిడ్డ కావచ్చని డాక్టర్లు చెబితే అవాక్కయ్యారు.

తన భార్య కడుపులో రెండో పిండం ఏర్పడిందని, తొలి బిడ్డతో పోలిస్తే, చాలా నెమ్మదిగా ఎదుగుతోందని వైద్యులు చెప్పడంతో ఏదో అద్భుతం జరగబోతున్నదని అనుకున్నానని చెప్పాడు. "మీరు కవలలకు జన్మనివ్వబోతున్నారు" అని సోనోగ్రాఫర్ చెప్పగానే తనకు సంతోషం, ఆందోళన రెండూ ఒకేసారి కలిగాయన్నాడు.

అయితే, కవలల పిండాలు ఒకేసారి ఏర్పడినవి కాదని, ఒకసారి గర్భం దాల్చిన తరువాత, మరో గర్భం ఏర్పడటం అత్యంత అరుదైన విషయమని, డాక్టర్లు చెప్పారని, వైద్య శాస్త్రంలోనే ఓ అరుదైన ఘటన జరగబోతున్నదని తనకు అర్థమైందని అన్నారు. ఆపై పలుమార్లు స్కానింగ్ తీయిస్తూ, బిడ్డల కండిషన్ పై ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకున్నానని చెప్పారు. ఇక ఇద్దరి డ్యూ డేట్లు వేర్వేరు అయినా, ఒకేసారి సిజేరియన్ చేసి, వైద్యులు ఆ కవలలను బయటకు తీశారు. వాళ్లిద్దర్నీ చూసుకుని ఇప్పుడు ఆ జంట మురిసిపోతోంది. 

ఇదిలావుండగా, ఈ తరహా కేసులను సూపర్ ఫెటాషన్ కేసులుగా వ్యవహరిస్తారు. 2008లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండ్ రీ ప్రొడక్టివిటీ బయాలజీ అందించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకూ ఇటువంటి కేసులు కేవలం 10 మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా గర్భం దాల్చగానే మహిళ శరీరంలో హార్మోన్లలో మార్పులు జరిగి, మరో అండం ఏర్పడదు. కానీ, రాబర్ట్స్ విషయంలో అలా జరగక పోవడమే రెండో గర్భానికి కారణమైంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1