షూటింగ్ కోసం మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన రజనీకాంత్!

09-04-2021 Fri 08:19
Advertisement 1

దాదాపు ఐదు నెలల క్రితం 'అన్నాత్తే' షూటింగ్ ను హైదరాబాద్ లో చేస్తూ, అనారోగ్యం బారిన పడి, ఆపై తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని సంచలన ప్రకటన చేసిన రజనీకాంత్, తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారు. తమిళనాడులో ఎన్నికల హడావుడి ముగియడంతో ఆయన నిన్న ప్రత్యేక విమానంలో బయలుదేరి సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు తమిళనాట వైరల్ అయ్యాయి.

సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ వంటి స్టార్స్ నటిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో ఈ చిత్రం నిర్మాణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆపై కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లోనే చికిత్స తీసుకున్న ఆయన, చెన్నైకి వెళ్లి, తాను రాజకీయాలకు దూరమేనని స్పష్టమైన ప్రకటన చేశారు.

అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్, గడచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బయటకు రాలేదు. ఇక అన్నాత్తే షూటింగ్ ఇప్పటికే 75 శాతం వరకూ పూర్తి కాగా, మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేందుకు రజనీకాంత్ హైదరాబాద్ కు వచ్చేశారు. ఈ చిత్ర షూటింగ్ లో అధిక భాగం, ఇక్కడి స్టూడియోల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న రజనీకాంత్ చెన్నై నుంచి బయలుదేరగా, ఎయిర్ పోర్టు వద్ద తన కోసం వచ్చిన అభిమానులకు ఆయన అభివాదం పలికి బయలుదేరారు.

ఈ సినిమా షూటింగ్ లో మిగిలిన భాగాన్ని పూర్తిగా కరోనా నిబంధనలు పాటిస్తూ పూర్తి చేయాలని రజనీకాంత్ భావిస్తున్నారు. మరోసారి అనారోగ్యం బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించారు. ఇక షూటింగ్ కూడా అన్ని రకాల ముందు జాగ్రత్తలు పాటిస్తూ జరగనున్నట్టు తెలుస్తోంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1