జానారెడ్డిని మరింత ముంచడానికే కాంగ్రెస్ నేతలు వచ్చారు: తలసాని

08-04-2021 Thu 20:30
Advertisement 1

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తరఫున నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున జానారెడ్డి, బీజేపీ తరఫున డాక్టర్ పానుగోతు రవికుమార్ బరిలో దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ లో నోముల భగత్ తిరుగులేని మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. నోముల భగత్ రాజకీయాల్లో జూనియర్ అంటూ ప్రచారం చేస్తున్నారని.... అభివృద్ధి చేయడానికి ఎవరైతే ఏంటి? అని ప్రశ్నించారు. జానారెడ్డి ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే జానారెడ్డి మునిగిపోయి ఉంటే, ఆయనను మరింతగా ముంచడానికి కాంగ్రెస్ నేతలు వచ్చారని ఎద్దేవా చేశారు.

గత మూడున్నర దశాబ్దాలుగా జానారెడ్డి ఇక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పుడా ప్రజలను చైతన్యం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు వచ్చారని తలసాని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ లో ఈ నెల 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1