ముంబైలో నిండుకున్న కరోనా వ్యాక్సిన్లు.. టీకా కేంద్రాల్లో నో స్టాక్​ బోర్డులు!

08-04-2021 Thu 14:33
Advertisement 1

దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడుతోంది. చాలా మంది టీకాలకు ముందుకు వస్తుండడంతో డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడం.. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండడంతో ముంబైలో టీకాలు వేగంగా అయిపోతున్నాయి.

ఆర్థిక రాజధాని ముంబైలో 120 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేస్తుండగా.. ఇప్పటికే 26 కేంద్రాల్లో టీకాలు అయిపోయినట్టు అదనపు మున్సిపల్ కమిషనర్ సురేశ్ కాకానీ చెప్పారు. ఇవాళ సాయంత్రం నాటికి మరో 20 కేంద్రాల్లో ఖాళీ అయ్యే చాన్స్ ఉందన్నారు. రేపటికి ఇంకో 25 కేంద్రాల్లో వ్యాక్సిన్లు అయిపోతాయని చెప్పారు.

వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను సరఫరా చేయకపోతే ముంబైలోని అన్ని కేంద్రాల్లోనూ కరోనా టీకాలు ఖాళీ అయ్యే ప్రమాదముందన్నారు. ప్రస్తుతం 120 వ్యాక్సిన్ కేంద్రాల్లో 73 ప్రైవేట్ కేంద్రాలే. మిగతా 53 ప్రభుత్వ ఆసుపత్రులు. కాగా, ముంబైతో పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా, గోండియా, చంద్రాపూర్ లలోనూ వ్యాక్సిన్ల కొరత ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడున్న వ్యాక్సిన్లు మూడు రోజుల వరకు సరిపోతాయని బుధవారం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చెప్పడం గమనార్హం.


ఇటు ఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్ లోనూ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. టీకాల్లేక కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ఆగిపోయింది. మళ్లీ స్టాక్ ఎప్పుడొస్తుందో చాలా ఆసుపత్రులకు తెలియని పరిస్థితి ఏర్పడింది. గత సోమవారం కేవలం 50 మందికే వ్యాక్సిన్ వేశామని ఘాజియాబాద్ లోని లైఫ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అలోక్ గుప్తా తెలిపారు. సాధారణంగా రోజూ 200 మందికి వ్యాక్సిన్ వేస్తుంటామన్నారు.

వ్యాక్సిన్లు ఎప్పుడొస్తాయన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. అయితే, ముందే వ్యాక్సినేషన్ కోసం టైం బుక్ చేసుకున్నవారు టీకా కోసం వస్తున్నారని, వ్యాక్సిన్లు లేవంటే గొడవ పడుతున్నారని చెప్పారు. కాగా, నేడు 12,000 మందికి వ్యాక్సిన్ వేయాలని ఘాజియాబాద్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం 6,500 డోసులే ప్రభుత్వం నుంచి అందాయి. అయితే, శుక్రవారం మిగతా డోసులను వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు, నోయిడాలోనూ వ్యాక్సిన్లు అయిపోవస్తున్నాయి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1