కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

08-04-2021 Thu 12:41
Advertisement 1

మొదటి నుంచి కూడా రవితేజకి దూకుడు ఎక్కువే. కథలను ఎంచుకునే విషయంలో .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో .. సెట్స్ పైకి తీసుకెళ్లే విషయంలో నాన్చుడు ధోరణి రవితేజకి అలవాటులేదు. ఒక ఏడాదిలో సాధ్యమైనన్ని సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఉంటాడు. మూడు నాలుగు సినిమాలకు తగ్గకుండా చూసుకుంటాడు. ఇక ఒక సినిమా హిట్ కొడితే హడావిడి చేయడం .. ఫట్ అయితే కుంగిపోవడం కూడా ఆయనకి తెలియదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున తరువాత కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే హీరోగా రవితేజనే కనిపిస్తాడు.

తాజాగా కూడా ఆయన ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఒక కొత్తకుర్రాడు రవితేజను కలిసి కథను వినిపించాడట. అతను కథను చెప్పిన విధానం చూసిన రవితేజ .. అతని టాలెంట్ పై గల నమ్మకంతో ఓకే చెప్పాడని అంటున్నారు. 'విరాటపర్వం' సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేదిశగా పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం 'ఖిలాడి' సినిమా చేస్తున్న రవితేజ, ఆ తరువాత త్రినాథరావు నక్కినతో ఒక సినిమా చేయనున్నాడు. ఇక మారుతికి కూడా ఓకే చెప్పినట్టుగా కూడా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1