కష్టాల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్... లీగల్ నోటీసు పంపించిన ఆస్ట్రాజెనికా!

08-04-2021 Thu 10:04
Advertisement 1

ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు కష్టాల్లో పడింది. వ్యాక్సిన్ సరఫరాను ఆలస్యం చేస్తున్నారంటూ అదార్ పూనావాలా అధీనంలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆస్ట్రాజెనికా లీగల్ నోటీసులు పంపింది.

ఈ విషయాన్ని 'బిజినెస్ స్టాండర్డ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్ సరఫరా ఆలస్యం అవుతోందన్న విషయం భారత ప్రభుత్వానికి కూడా తెలుసునని, లీగల్ నోటీసులు కాన్ఫిడెన్షియల్ కాబట్టి, ఇంతకన్నా తాను ఏమీ వ్యాఖ్యానించలేనని అన్నారు.

ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇండియాకు వ్యాక్సిన్ సరఫరాపైనే ప్రధానంగా దృష్టిని సారించినందునే అనుకున్న ప్రకారం, టీకాను సరఫరా చేయలేకపోయామని ఆయన స్పష్టం చేశారు.

ఈ నోటీసుల సమస్య నుంచి బయట పడేందుకు మార్గాలను ప్రభుత్వం సైతం అన్వేషిస్తోందని తెలిపారు. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ, నిజం చెప్పాలంటే, తనపై ఎంతో ఒత్తిడి ఉందని అదార్ పూనావాలా బుధవారం నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలకు భారీఎత్తున వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని, ఈ విషయంలో విదేశాలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు.

ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ ఎంతో అవసరమన్న సంగతి తమకు తెలుసునని, చాలా దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ఖర్చుతో పోలిస్తే, అధిక ధరకు విక్రయాలు జరుగుతున్నాయని, ఇండియాలో మాత్రం తాము సబ్సిడీ ధరకే అందిస్తున్నామని ఆయన అన్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1