నా దేశం ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది: కిమ్ జాంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు

08-04-2021 Thu 08:40
Advertisement 1

తన దేశం ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తలు వేలాదిగా హాజరుకాగా, పాంగ్ యాంగ్ లో జరిగిన రాజకీయ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

దాదాపు దశాబ్ద కాలంగా కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియాను పాలిస్తుండగా, కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పెట్టిన లాక్ డౌన్ తో వ్యవస్థ కుదేలైంది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తుండటం, అణ్వాయుధాల ప్రయోగాల తరువాత ఆంక్షల తీవ్రత పెరగడంతో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

వర్కర్స్ పార్టీ కార్యదర్శుల సమావేశం ప్రారంభోపన్యాసం సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ ఈ వ్యాఖ్యలు చేశారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నాను. అత్యంత గడ్డు పరిస్థితుల్లో నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. వీటిని అధిగమించేందుకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలి" అని అన్నారు.

జనవరిలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న అన్ని నిర్ణయాలనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత ప్రభుత్వంపై కన్నా కార్యదర్శుల పైనే ఉందని కిమ్ జాంగ్ ఉన్ అభిప్రాయపడ్డారు. సరికొత్తగా రూపొందించిన ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళిక అమలును వేగంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయిలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, ఇకపై అటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1