దివాలా వార్తలను ఖండించిన ఓయో!

08-04-2021 Thu 08:01
Advertisement 1

రెండు రోజుల క్రితం ప్రముఖ ఆతిథ్య సంస్థ ఓయో ఐబీసీ 2016 చట్టం కింద దివాలా పిటిషన్ దాఖలు చేసిందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితీశ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేసిన ఆయన, తామేమీ ఇటువంటి పిటిషన్ ను వేయలేదని, ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

"ఓయో సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఓ పీడీఎఫ్ ఫైల్, మరో టెస్ట్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. సంస్థలో పెట్టుబడులు పెట్టిన అనుబంధ సంస్థ ఓ హక్కుదారు రూ.16 లక్షలను కోరుతూ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. అంతకుమించి ఇంకేమీ లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆ మొత్తాన్ని చెల్లించి, ఆ విషయాన్ని ఎన్సీఎల్టీకి వెల్లడించామని, వారు విచారిస్తున్నారని, కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆతిథ్య పరిశ్రమ కోలుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ అతిపెద్ద మార్కెట్ నగరాలు ఇప్పుడిప్పుడే లాభాల్లోకి నడుస్తున్నాయని రితీశ్ అగర్వాల్ వెల్లడించారు. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న సమాచారాన్ని కూడా పోస్ట్ చేసిన ఆయన, ఇటువంటి నిరాధార వార్తలను నమ్మవద్దని కోరారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1