మహారాష్ట్ర నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల కరోనాపై యావత్తు దేశం చేస్తున్న పోరు నీరిగారిపోయే ప్రమాదం: కేంద్రం

07-04-2021 Wed 19:54
Advertisement 1

మరో మూడు రోజుల్లో తమ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ డోసులు పూర్తయిపోయే అవకాశం ఉందన్న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యలపై కేంద్రం తీవ్ర స్థాయిలో మండిపడింది. కొన్ని రాష్ట్రాలు కొవిడ్‌ కట్టడిలో తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు అర్థరహిత ప్రకటనలు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆరోపించారు. తద్వారా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. మహారాష్ట్ర నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల కరోనాపై యావత్తు దేశం చేస్తున్న పోరు నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఘాటుగా విరుచుకుపడ్డారు.

ఈరోజు ఉదయం రాజేశ్‌ తోపే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మరో మూడు రోజుల్లో వ్యాక్సిన్‌ నిల్వలు పూర్తయిపోతాయని తెలిపారు. కేంద్రం వీలైనంత త్వరగా మరిన్ని డోసులు అందజేయాలని కోరారు. లేదంటే ముంబయి వంటి నగరాల్లో టీకా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని.. ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం ఉందని హర్షవర్ధన్ అన్నారు. అలాగే జనాల్లో భయాందోళనలు పెరిగిపోతాయని తెలిపారు. ‘‘నా మౌనాన్ని బలహీనతగా భావించకూడదు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తోంది. రాజకీయాలు చేయడం చాలా సులభం. కానీ, పాలన, వైద్యారోగ్య మౌలిక వసతుల్ని మెరుగుపరచడమే నిజమైన పరీక్ష’’ అని హర్షవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపైన కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంస్థాగత క్వారంటైన్‌ నుంచి ప్రజల్ని తప్పించుకునేందుకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వం.. ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు. కొవాగ్జిన్‌ టీకాను నిరాకరించిన ఛత్తీసగఢ్‌ ప్రభుత్వంపైనా హర్షవర్ధన్ మండిపడ్డారు. బహుశా ప్రపంచంలో కరోనా టీకాను నిరాకరించిన ఏకైక ప్రభుత్వం ఇదే అయి ఉంటుందని ఎద్దేవా చేశారు.

18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందించాలని డిమాండ్‌ చేస్తున్న నాయకులపైనా హర్షవర్ధన్‌ మండిపడ్డారు. టీకా సరఫరాలో పరిమితులు ఉన్నంత కాలం ప్రాధాన్యక్రమంలోనే వ్యాక్సిన్‌ అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఇంకో మార్గం లేదని స్పష్టం చేశారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1