నిజం చెప్పాలంటే చాలా ఒత్తిడిలో ఉన్నాము: అదర్ పూనావాలా

07-04-2021 Wed 07:20
Advertisement 1

ఇండియాలో అనుమతి పొందిన టీకాల్లో ఒకటైన కొవిషీల్డ్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా, వ్యాక్సిన్ తయారీ, పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ ను తయారు చేసేందుకు ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యం ఏ మాత్రమూ సరిపోవడం లేదని అభిప్రాయపడిన ఆయన, వాస్తవానికి తమపై చాలా ఒత్తిడి ఉందని అన్నారు.

ప్రస్తుతం నెలకు 6 నుంచి ఆరున్నర కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేస్తున్నామనీ,  ఇప్పటివరకూ 10 కోట్ల డోస్ లను భారతావనిలో వాడకానికి ఇవ్వడంతో పాటు మరో 6 కోట్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశామని అదర్ చెప్పారు. అయినప్పటికీ, దేశంలో వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందించేందుకు ఎంతో దూరంలో ఉన్నామని ఆయన అన్నారు.

"ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ అవసరం ఎంతైనా ఉంది. అయినా మేము తొలుత భారత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి భారతీయుడికీ టీకాను ఇవ్వడానికి ఇంకా ఎంతో సమయం పడుతుంది. మాకు ఇంకా రూ. 3 వేల కోట్ల పెట్టుబడి అవసరం. చాలా ఎక్కువ డిస్కౌంట్ తో టీకాను ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇదే సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి వుంది. జూన్ నాటికి ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుందని భావిస్తున్నాం" అని అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు.

"ఇండియాకు దాదాపుగా రూ. 150 నుంచి రూ. 160 ధరపై వ్యాక్సిన్ ను అందిస్తున్నాం. కానీ దీనిని సరాసరి రూ. 1500 (20 డాలర్లు) వరకూ విక్రయించాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం కోరిక మేరకు సబ్సిడీ ధరలకు టీకా ఇస్తున్నాం. అలా అని మాకు లాభాలు రావడం లేదని అనడం లేదు. భారీ లాభాలు మాత్రం లేవు. అందుకే   తిరిగి పెట్టుబడులు పెట్టలేకపోతున్నాము. ఇప్పుడు అనుకున్న ఉత్పత్తి ప్రక్రియకు చేరడానికి దాదాపు 85 రోజుల వరకూ సమయం పడుతుంది. ఇదే విషయమై కేంద్రానికి లేఖను కూడా రాశాము. ప్రభుత్వం నుంచి పెట్టుబడి విషయంలో వచ్చే స్పందను బట్టి, రుణం కోసం బ్యాంకులను ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నాం" అని పూనావాలా వ్యాఖ్యానించారు.

'అలాగే, మా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 10 కోట్ల డోసుల వరకు పెంచినప్పటికీ, ఇండియాకు అవసరమయ్యే డోసులను మాత్రం ఇవ్వలేం. మరికొందరు తయారీదారులు కూడా తోడవ్వాల్సిందే' అని చెప్పారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1