సీబీఐ విచార‌ణ నేప‌థ్యంలో సీఎంను క‌లిసి రాజీనామా లేఖ ఇచ్చిన మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్

05-04-2021 Mon 15:31
Advertisement 1

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ పై వ‌చ్చిన‌ అవినీతి ఆరోప‌ణ‌లపై ప్రాథమిక ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం  తెలిసిందే. 15 రోజుల్లో ఈ ప్రాథ‌మిక‌ విచార‌ణ పూర్తి చేయాల‌ని, ఆధారాలు ల‌భ్య‌మైతే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

 ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర హోంమంత్రి ప‌ద‌వికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేకు ఈ మేర‌కు ఆయ‌న రాజీనామా లేఖ పంపారు. త‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో ప‌ద‌విలో కొన‌సాగ‌డం నైతికంగా స‌రికాద‌ని, అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు అందులో ఆయ‌న పేర్కొన్నారు.

అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా విష‌యంపై ఎన్సీపీ నేత, మంత్రి న‌వాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ... 'హైకోర్టు నుంచి సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు వ‌చ్చిన అనంత‌రం మా పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు పార్టీలోని ప‌లువురు నేత‌ల‌ను అనిల్ దేశ్ ముఖ్ క‌లిశారు. విచార‌ణ నేప‌థ్యంలో హోంమంత్రి ప‌ద‌విలో కొన‌సాగ‌బోన‌ని చెప్పారు. అనంత‌రం సీఎంను క‌లిసి, రాజీనామా లేఖ ఇవ్వ‌డానికి వెళ్లారు. ఆయ‌న రాజీనామాను ఆమోదించాల‌ని మా పార్టీ కూడా సీఎంను కోరింది' అని చెప్పారు.  కాగా, ఆయ‌న రాజీనామాను ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే ఇంకా ఆమోదించ‌లేదు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1