అల్లు అర్జున్ ను లైన్లో పెట్టేసిన అనిల్ రావిపూడి!

05-04-2021 Mon 11:21
Advertisement 1

తెలుగులో రాజమౌళి.. కొరటాల ఇంతవరకూ అపజయమెరుగని దర్శకులుగా దూసుకుపోతున్నారు. ఆ ఇద్దరి సరసన నిలిచే మరో దర్శకుడే అనిల్ రావిపూడి. ఆయన తన కెరియర్ ను ఓ మాదిరి హీరోలతోనే మొదలుపెట్టేసి, ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతున్నాడు.

ప్రతి సినిమాను పై వరుసలో ఉన్న హీరోలతో చేస్తూ .. బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాడు. అనిల్ రావిపూడి ఎంచుకునే కథా నేపథ్యం ఏదైనా అందులో కామెడీ అనేది కలిసి ప్రవహించేలా చూసుకుంటాడు. శ్రీను వైట్ల తరువాత ఆ స్థాయి కామెడీ ఎపిసోడ్స్ అనిల్ రావిపూడి సినిమాల్లోనే కనిపిస్తాయి .. కడుపుబ్బ నవ్విస్తాయి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు హిట్ కొట్టిన 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ప్రాజెక్టు ఫలానా హీరోతో ఉండనుందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది.

ఇటీవలే అల్లు అర్జున్ ను కలిసిన అనిల్ రావిపూడి ఒక కథను వినిపించగా, అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 'పుష్ప' తరువాత ఆయన చేసే నెక్స్ట్ ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు. ఈ కథ కూడా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గానే సాగుతుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1