డ్రగ్స్ దందాలో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇద్దరు వ్యాపారులకు తాఖీదులు ఇవ్వనున్న కర్ణాటక పోలీసులు!

05-04-2021 Mon 08:49
advertisement

కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ దందా, ఇప్పుడు తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పలుమార్లు బెంగళూరుకు వెళ్లి, డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారని గుర్తించామని గోవిందపుర పోలీసు ఇనస్పెక్టర్ ప్రకాశ్, ఆదివారం నాడు మీడియాకు తెలిపారు. వారి హాజరుపై తాము సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఆ తరువాత విచారిస్తామని స్పష్టం చేశారు. వారందరినీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించనున్నామని తెలిపారు.

కాగా, ఈ కేసులో ప్రజా ప్రతినిధులతో పాటు టాలీవుడ్ కు చెందిన వారికీ ప్రమేయం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీరి పేర్లన్నీ ఇప్పటివరకూ రికార్డులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇంతవరకూ వారి పేర్లను కర్ణాటక పోలీసులు బయట పెట్టలేదు. అయితే, నోటీసులు జారీ చేస్తే మాత్రం, వారు ఎవరన్న విషయం తేలిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాపారులు కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, విచారణకు రావాలని ఆదేశించారు.

ఈ దందాలో శాండల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించిన తరువాత, తెలంగాణ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కలహర్ రెడ్డి హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేసేవాడని, అతనికి శంకర్ గౌడ ద్వారా బెంగళూరు నుంచి మత్తు ముందులు అందేవని కూడా పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో బెంగళూరులో జరిగే డ్రగ్స్ పార్టీలకు ఇరాన్ నుంచి అమ్మాయిలను రప్పించేవారని తేల్చిన పోలీసులు, వారు ఎవరు? ఎప్పుడెప్పుడు వచ్చారు? హైదరాబాద్ పార్టీలకు కూడా వెళ్లారా? అనే యాంగిల్ లో పోలీసులు కేసును విచారిస్తున్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement