ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వీడియోతో అన్నాడీఎంకే యాడ్.. విమర్శల వెల్లువ!

05-04-2021 Mon 06:49
Advertisement 1

మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ 'నీట్'లో పాస్ కానేమోనన్న ఆందోళనలో ఓ స్టూడెంట్ టాపర్ ఆత్మహత్య చేసుకోగా, ఆమె వీడియోను పోస్ట్ చేసిన తమిళనాడు విద్యా శాఖామంత్రి ఫోయి పాండియరాజన్, తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని డిలీట్ చేశారు.

పాత వీడియోలను కలుపుతూ ఓ ఎన్నికల ప్రచార వీడియోను ఆయన తయారు చేయించారు. ఈ వీడియోలో 17 సంవత్సరాల అనిత అనే మృతిచెందిన యువతి కూడా ఉంది. మెడికల్ అడ్మిషన్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7 శాతం రిజర్వేషన్లను అన్నాడీఎంకే ప్రభుత్వం కల్పించడాన్ని ఆమె ప్రశంసించినట్టు ఉంది.

"తమిళనాడు చరిత్రలో తొలిసారిగా 400 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించింది. జయలలిత పాలన ఈ అవకాశాన్ని దగ్గర చేసింది. ఇదే సమయంలో 17 మంది విద్యార్థుల వైద్య విద్య కలలను సర్వనాశనం చేసిన డీఎంకేను మరువద్దు. మీ చేతిలో ఉన్న ఓటు మీ జీవితమేనన్న సంగతి గుర్తుంచుకోండి" అని ఉంది.

ఇక ఈ వీడియోపై స్పందించిన అనిత సోదరుడు మంత్రి పాండియరాజన్ పై విరుచుకుపడ్డారు. మీరు శవాలను తినే పురుగుల కన్నా హీనమని నిరూపించుకున్నారని విమర్శించారు. ఈ వీడియోను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆపై మహిళా సంఘాలతో పాటు పలువురు ఈ వీడియోపై విమర్శలు గుప్పించడంతో పాండియరాజన్ దాన్ని తొలగించారు.

మరో వీడియోను మంత్రి షేర్ చేస్తూ, ఈ ప్రచార యాడ్ ను తన అనుమతి లేకుండానే పోస్ట్ చేశారని వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. తనకు తెలియకుండా ఈ యాడ్ ను పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశానని అన్నారు.

కాగా, తమిళనాడులో నీట్ పరీక్షలు, ఈ ఎన్నికల వేళ మరోమారు తెరపైకి వచ్చాయి. గడచిన కొన్నేళ్లలో 17 మంది విద్యార్థినీ విద్యార్థులు, నీట్ పరీక్ష పాస్ కామేమోనన్న ఆందోళనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరీక్షను నిషేధించాలని అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే కూడా డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1