జూమ్ కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయి, తిట్లవర్షం.. ఉద్యోగం కోల్పోయిన టీచరమ్మ!

31-03-2021 Wed 21:41
advertisement

కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది చాలావరకు ఆన్ లైన్ లోనే విద్యాబోధన జరిగింది. జూమ్ వీడియో యాప్ ద్వారా పాఠాలు చెప్పే ట్రెండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థికి ఆన్ లైన్ లో పాఠాలు చెప్పిన పంతులమ్మ ఆపై జూమ్ కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయింది. నోటికొచ్చిన రీతిలో ఆ విద్యార్థి కుటుంబంపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి చేస్తున్న ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది.

స్థానిక పామ్ డేల్ స్కూల్లో కింబర్లీ న్యూమన్ అనే మహిళ సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇదే స్కూల్లో స్టోక్స్ ఓ విద్యార్థి. అయితే, కరోనా ప్రభావంతో ఆ స్కూల్ బోధన యావత్తు ఆన్ లైన్ కు మారింది. స్టోక్స్ ఈ విధానానికి అలవాటుపడలేకపోయాడు. దాంతో అతడి తల్లి కటూరా స్టోక్స్ స్కూల్ కు విన్నవించుకోగా, వారు ఆ విద్యార్థికి ఆన్ లైన్ బోధనలో సాయపడాలంటూ ఉపాధ్యాయురాలైన కింబర్లీ న్యూమన్ కు సూచించారు.

స్కూలు యాజమాన్యం చెప్పినట్టే కింబర్లీ న్యూమన్ జూమ్ కాల్ ద్వారా ఆ విద్యార్థి ఆన్ లైన్ బోధనలో సాయపడింది. అయితే క్లాసు ముగిశాక జూమ్ వీడియో కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయింది. మరొకరితో మాట్లాడుతూ స్టోక్స్ కుటుంబంపై ఇష్టంవచ్చినట్టుగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసింది. వాళ్లు నల్లజాతీయులని, తల్లీకొడుకులు ఇద్దరూ సోమరిపోతులని అంటూ మరికాస్త తీవ్ర పదజాలం కూడా వాడింది. పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్లేం తల్లిదండ్రులు? అంటూ వ్యాఖ్యానించింది.

జూమ్ వీడియో కాల్ ఆన్ లోనే ఉండడంతో స్టోక్స్, అతని తల్లి కటూరా స్టోక్స్ టీచర్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తేరుకుని ఆ కాల్ ను రికార్డు చేశారు. దాంతో కింబర్లీ న్యూమన్ చేసిన జాతివ్యతిరేక వ్యాఖ్యలన్నీ రికార్డయ్యాయి. ఆ వీడియో ఆధారాలతో కటూరా స్టోక్స్ పామ్ డేల్ స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో కింబర్లీ న్యూమన్ ఉద్యోగం ఊడింది.

స్కూలు అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అనంతరం ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయింది. జిల్లా అధికార యంత్రాంగం కింబర్లీ న్యూమన్ పై విచారణ జరుపుదామన్నా, ఆమె అందుబాటులో లేకుండా పోయిందట! కనీసం వివరణ కోరదామని మీడియా ప్రయత్నించినా ఆమె స్పందించలేదు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement