ఉగాది తరువాత పరిస్థితేంటి? పునరాలోచనలో పడ్డ టీటీడీ!

31-03-2021 Wed 11:26
advertisement

ఈ ఉగాది నుంచి తిరుమలలో అన్ని ఆర్జిత సేవలకూ భక్తులను అనుమతించాలని ఇటీవల తాము తీసుకున్న నిర్ణయంపై టీటీడీ పునరాలోచనలో పడింది. ఆర్జిత సేవలకు హాజరయ్యే వారు తమ వెంట గరిష్ఠంగా 72 గంటల ముందు తీసుకున్న కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను తీసుకుని రావాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. అయితే, కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఉగాది తరువాత ఆర్జిత సేవలకు అనుమతిపై మరోసారి చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల సంఖ్యను టీటీడీ తగ్గించిన సంగతి తెలిసిందే. రోజుకు 22 వేలకు పైగా టికెట్లను తిరుపతిలోని వివిధ కేంద్రాల నుంచి మరుసటి రెండు రోజులకూ కేటాయిస్తున్న టీటీడీ, ఆ సంఖ్యను 15 వేలకు తగ్గించింది. అవసరమైతే రూ. 300 టికెట్ల దర్శనం కోటాను కూడా తగ్గిస్తామని అధికారులు తెలిపారు.

ఇక కరోనా లక్షణాలు ఉన్నవారు ఎవరూ తిరుమలకు రావద్దని, స్వామి దర్శనం అనంతరం వెంటనే కొండ దిగి వెళ్లిపోవాలని, తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో మాస్క్ లు తప్పనిసరని టీటీడీ ఆదేశించింది. అన్న సత్రం, కల్యాణకట్ట, క్యూలైన్లలో శానిటైజర్లను ఏర్పాటు చేశామని, భౌతిక దూరం పాటిస్తూ, భక్తులు దర్శనాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని వెల్లడించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement