పెద్ద కూతురికి చికిత్స కోసం చిన్న కూతురును అమ్మేసిన తల్లిదండ్రులు.. ఏపీలో దారుణ ఘటన

27-02-2021 Sat 12:48
advertisement

జబ్బు చేసిన 16 ఏళ్ల తమ పెద్ద కూతురికి చికిత్స చేయిద్దామంటే చేతిలో డబ్బుల్లేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. ఏం చేయాలో పాలుపోని దీన స్థితిలో ఉన్న వారి చిన్న కూతురిపై ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి కన్ను పడింది. రూ.10 వేలిస్తా.. ఆ అమ్మాయిని తనకిచ్చేయమంటూ బేరం పెట్టాడు.

పెద్ద కూతురుకు చికిత్స చేయించాలంటే డబ్బు అవసరమైన పరిస్థితుల్లో తండ్రి వరుసైన ఆ వ్యక్తికి తమ చిన్న కూతురును వారు అమ్మేశారు. నేరమని తెలిసినా 12 ఏళ్ల ఆ చిన్నారిని ఆ వ్యక్తి పెళ్లాడాడు. కటకటాల పాలయ్యాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కొత్తూరులో బుధవారం జరిగింది.

చిన్నారిని డబ్బుకు కొని, పెళ్లాడిన చిన్న సుబ్బయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. ఆ ఘటన గురించి తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు తెల్లారే అమ్మాయిని కాపాడారు. పిల్లల సంరక్షణ కేంద్రంలో అమ్మాయికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

అయితే, మొదట్నుంచి ఆ అమ్మాయిపై సుబ్బయ్య కన్ను ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంటి పక్కనే ఉండే అతడు.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గతంలోనూ పలుమార్లు కుటుంబానికి ఆఫర్లు చేశాడని పోలీసులు చెప్పారు.  

ఈ క్రమంలోనే బుధవారం అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డీల్ మాట్లాడుకున్నాడని, వారు రూ.25 వేలు అడగ్గా, రూ.10 వేలిచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వెల్లడిండారు. అదే రోజు రాత్రి అమ్మాయి సహా సుబ్బయ్య తన బంధువుల ఇంటికి వెళ్లాడన్నారు. ఇంట్లో నుంచి అమ్మాయి అరుపులు, ఏడుపులు వినిపించడంతో స్థానికులు వచ్చి నిలదీశారని, విషయం తెలిసి సర్పంచ్ కు ఫిర్యాదు చేయగా ఈ బాగోతమంతా బయటపడిందని చెప్పారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement