ఐపీఎల్ వేలంలో మ్యాక్స్ వెల్ కు అదిరిపోయే ధర... రూ.14.25 కోట్లతో సొంతం చేసుకున్న ఆర్సీబీ

18-02-2021 Thu 16:04
advertisement

ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ భారీ ధర పలికాడు. మ్యాక్స్ వెల్ ను రూ.14.25 కోట్ల మొత్తానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. కాగా, వేలం సందర్భంగా మ్యాక్స్ వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరివరకు ఆర్సీబీతో పోటీపడింది. మ్యాక్స్ వెల్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అక్కడి నుంచి వేలం పోటాపోటీగా సాగింది. చివరికి మ్యాక్స్ వెల్ ఆర్సీబీ సొంతమయ్యాడు.

మ్యాక్స్ వెల్ గత ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలమై, విమర్శల పాలయ్యాడు. అయితే, సొంతగడ్డ ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్ తో పాటు, భారత్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో విశేషంగా రాణించాడు. దాంతో మ్యాక్స్ వెల్ కు మరోసారి డిమాండ్ ఏర్పడింది. కాగా, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత టెస్టు ఆటగాడు హనుమ విహారిలను కొనుక్కునేందుకు ఏ ఫ్రాంచైజీ సుముఖత వ్యక్తం చేయలేదు. వీళ్లద్దరి కనీస ధర రూ.1 కోటి కాగా, ఎవరూ ఆసక్తి చూపలేదు.

ఇక, రాజస్థాన్ రాయల్స్ కు గత సీజన్ లో నాయకత్వం వహించిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. స్మిత్ వంటి అగ్రశ్రేణి ఆటగాడు తాజా వేలంలో రూ.2.20 కోట్లకే అమ్ముడయ్యాడు. గత సీజన్ లో అటు కెప్టెన్ గానూ, ఇటు బ్యాట్స్ మన్ గానూ విఫలం కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్మిత్ ను వదులుకుంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement