ట్విస్టుల మీద ట్విస్టులు.. ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్లకు క్లీన్ చిట్!

13-02-2021 Sat 07:55
advertisement

హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ సమీపంలో ఫార్మాసీ విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. నిందితులైన ఆటో డ్రైవర్లకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధమూ లేదని గుర్తించారు.

ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారన్న యువతి ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజీలు పరీక్షించగా ఈ విషయం వెల్లడైంది. కాలేజీ వదిలిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఘట్‌కేసర్, యంనంపేట, అన్నోజీగూడ తదితర ప్రాంతాల్లో యువతి ఒంటరిగానే సంచరించినట్టు పోలీసులు గుర్తించారు.

నిందితులుగా అనుమానించిన ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ సంకేతాలేవీ ఆ ప్రాంతంలో లేకపోవడంతో బాధితురాలిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. చీకటి పడినా ఇంటికి ఇంకా ఎందుకు రాలేదంటూ, తల్లి పదేపదే ఫోన్లు చేయడంతో, విసుగొచ్చి ఆటో డ్రైవర్ తనను ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు చెప్పానని యువతి చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

మరోవైపు, ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితురాలిని గుర్తించిన ప్రాంతానికి పోలీసులు మరోమారు వెళ్లి పరిశీలించగా అక్కడ అత్యాచారం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో బాధితురాలిని ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె మానసికస్థితిని అనుమానించిన పోలీసులు కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసి విచారించారు.

ఈ సందర్భంగా ఓ స్నేహితుడు ఆమె గురించి చెప్పిన విషయం పోలీసులను మరోమారు నివ్వెరపరిచింది. గతంలో ఆమె తనకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేశారని చెప్పిందని, దీంతో తాను అక్కడికి వెళ్లి చూడగా అది నిజం కాదని తెలిసిందని చెప్పాడు. అప్పటి నుంచి ఆమెను తాను దూరం పెట్టానని చెప్పుకొచ్చాడు.

మరోవైపు, యువతిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు? యువతి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకు సంచరించింది? అన్నవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. దీంతో పోలీసులు ఇప్పుడు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement