వైద్య విద్యార్థుల ల్యాప్ టాప్ లే అతడి టార్గెట్... కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయిన పోలీసులు!

14-01-2021 Thu 15:38
advertisement

గుజరాత్ లోని జామ్ నగర్ పోలీసులు తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వన్ కణ్ణన్ అనే 24 ఏళ్ల యువకుడ్ని అరెస్ట్ చేశారు. అతడో ల్యాప్ టాప్ దొంగ. ఒకటీ రెండు కాదు... దాదాపు 500 వరకు ల్యాప్ టాప్ లను కొట్టేసిన ఘనత తమిళ్ సెల్వన్ సొంతం. అతడు చోరీ చేసిన ల్యాప్ టాప్ లన్నీ వైద్య విద్యార్థులవే కావడం గమనార్హం. ఈ విషయం గుర్తించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన అంశాలు వారిని మరింత నివ్వెరపరిచాయి.

అసలేం జరిగిందంటే... తమిళ్ సెల్వన్ కు ఓ స్నేహితురాలు ఉండేది. కొందరు వైద్య విద్యార్థులు ఆమెను అశ్లీలంగా చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేశారు. దాంతో తమిళ్ సెల్వన్ మనసు రగిలిపోయింది. తన ప్రియురాలికి ఎదురైన అవమానాన్ని తన అవమానంగా భావించి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతడు ఎంచుకున్న మార్గం ల్యాప్ టాప్ ల చోరీ. మొబైల్ ఫోన్లు చోరీ చేస్తే వాటిని సులువుగా ట్రాక్ చేస్తారని గుర్తించిన తమిళ్ సెల్వన్ ల్యాప్ టాప్ ల చోరీని ఎంచుకున్నాడు.

దేశంలో ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇంటర్నెట్లో వెదకడం... ఆపై మెడికల్ కాలేజీల హాస్టళ్లలో చోరీలు చేయడం తమిళ్ సెల్వన్ కు అలవాటుగా మారింది. 2015 నుంచి ఇదే తంతు. ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని మెడికల్ కాలేజీల్లో చోరీలకు పాల్పడ్డాడు. తర్వాత ఉత్తర భారతదేశంలోని కాలేజీలను లక్ష్యంగా చేసుకునేందుకు కొన్నాళ్లు హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలోని భంక్రీ గ్రామానికి కూడా మకాం మార్చాడు.

ఆ తర్వాత గుజరాత్ లోని జామ్ నగర్ కు వచ్చి, అక్కడి హోటల్ లో బసచేసి, సమీపంలోని గాళ్స్ హాస్టల్ లో ఓ రూము నుంచి లాప్ టాప్ లు తస్కరించాడు. ఎట్టకేలకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకోవడంతో ఈ ప్రతీకార చోరీల పర్వం వెలుగులోకి వచ్చింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement