48 మంది కార్పొరేటర్లతో కలసి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిన బండి సంజయ్.. కేసీఆర్‌పై మండిపాటు

18-12-2020 Fri 09:32
advertisement

హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ కార్పొరేటర్లు ఈ రోజు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.. ‘అమ్మవారి దయతో ఎన్నికల్లో గెలిచాం. ఆమె దయవల్లే వచ్చే ఐదేళ్లు కార్పొరేటర్లు ప్రజలకు సేవలు అందిస్తారు’ అని బండి సంజయ్ అన్నారు.

‘మమ్మల్ని నమ్మి విశ్వాసంతో గెలిపించిన ప్రజలకు సేవ చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, చేతగాని తనం, ఎంఐఎంతో ఆయన చేస్తోన్న దోస్తీ వల్ల పాతబస్తీ అభివృద్ధి జరగడం లేదు. అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు మద్దతు తెలిపారు’ అని బండి సంజయ్ తెలిపారు.

‘ఈ భాగ్యనగరాన్ని బీజేపీ మాత్రమే అభివృద్ధి చేయగలదని ప్రజలు నమ్ముతున్నారు. భాగ్యనగరంలో ఎంఐఎం, టీఆర్ఎస్ అడ్డుకుంటోన్న అభివృద్ధి చర్యలను మేము కొనసాగనివ్వం. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను టీఆర్ఎస్ అవమానిస్తోంది. కనీసం వరద బాధితులను టీఆర్ఎస్ ఆదుకోలేకపోతోంది’ అని బండి సంజయ్ అన్నారు.

‘నగరానికి భాగ్యలక్ష్మి దేవాలయం వల్లనే భాగ్యనగరం అన్న పేరు వచ్చింది. పాతబస్తీలో అభివృద్ధి జరగడం లేదు. గతంలో కాంగ్రెస్‌తో, ఇప్పుడు టీఆర్ఎస్‌తో కలిసి ఎంఐఎం పని చేస్తోంది. ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? అమ్మవారిని నమ్ముకుని మేము ముందుకు వెళ్తున్నాం. దేశం, ధర్మం, సమాజం కోసం మేము పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాం. హిందువులందరికీ శుక్రవారం మంచిరోజు. తాను మాత్రమే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇతరులు ఎవ్వరూ పాలించకూడదని కుట్రలు పన్నుతున్నారు. తాను  మరింత దోచుకోవాలని చూస్తున్నారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement