టీపీసీసీ పీఠం ఎవరికి?... కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు మొదలు!

10-12-2020 Thu 08:48
advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం, ఓటమికి నైతిక బాధ్యతను వహిస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన పదవికి రాజీనామా చేయగా, కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది.

ఈ దిశగా హైదరాబాదులోని గాంధీభవన్ ‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్, ఉత్తమ్ ‌కుమార్ ‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తున్నామని పలువురు నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని మాణికం తెలిపారు.

కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన‌ పదవికి రాజీనామా చేసినట్లు ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. కొత్త అధ్యక్షుడికి పూర్తిగా సహకరిస్తానని, ఎవరు బాధ్యతలు చేపట్టినా స్వాగతిస్తానని అన్నారు.

ఇక నేతల అభిప్రాయాలను సేకరించిన తాను పార్టీ అధినేత్రి సోనియాకు నివేదిక ఇస్తానని, తుది నిర్ణయం ఆమే తీసుకుంటారని మాణికం వెల్లడించారు. ఎంతో మంది నాయకులకు ఉత్తమ్ ఆదర్శంగా నిలిచారని, భవిష్యత్తులో ఉత్తమ్ కు ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని అన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement