బెంగళూరును భలే కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాట్స్ మెన్ వంతు!

31-10-2020 Sat 21:18
advertisement

ఈ ఐపీఎల్ లో విశేషమైన ఆటతీరు కనబర్చుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో తమవంతు పాత్రను సమర్థంగా పోషించారు. సందీప్ శర్మ, హోల్డర్, నటరాజన్, షాబాజ్ నదీమ్, రషీద్ ఖాన్ లతో కూడిన హైదరాబాద్ బౌలింగ్ దళం సమయోచితంగా రాణించడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సందీప్ శర్మ 2 వికెట్లు, హోల్డర్ 2 వికెట్లతో రాణించారు. నటరాజన్, రషీద్ ఖాన్, నదీమ్ తలో వికెట్ తీయడమే కాకుండా పరుగులు ఇవ్వడంలో పిసినారితనం చూపించారు. కోహ్లీ (7), ఏబీ డివిలియర్స్ (24), పడిక్కల్ (5) ఆశించినంతగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ ఫిలిప్పే సాధించిన 32 పరుగులే ఈ ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.

ఏ ఒక్క బెంగళూరు బ్యాట్స్ మన్ ను కూడా హైదరాబాద్ బౌలర్లు కుదరుకోనివ్వలేదు. ముఖ్యంగా, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ను పక్కా ప్లాన్ తో ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ పెట్టి అవుట్ చేసిన విధానం వార్నర్ కెప్టెన్సీకి మచ్చుతునకగా నిలుస్తుంది. మొత్తమ్మీద బౌలర్లు సమష్టిగా సత్తా చాటిన ఈ మ్యాచ్ లో ఇక భారం అంతా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ పైనే ఉంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement