దంచికొట్టిన డివిలియర్స్.. బెంగళూరు చేతిలో కోల్‌కతా చిత్తు

13-10-2020 Tue 06:41
advertisement

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. డివిలియర్స్ వీర బాదుడుతో బెంగళూరు తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. బెంగళూరు బౌలర్ల ముందు నిలవలేక 112 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌కు 23 పరుగుల వద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోకి వచ్చిన కొత్త కుర్రాడు టామ్ బాంటమ్ (8) నవదీప్ సైనీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పుడు మొదలైన వికెట్ల పతనం 19వ ఓవర్ వరకు కొనసాగింది. ఆదుకుంటారనుకున్న శుభ్‌మన్ గిల్ (34), నితీశ్ రాణా (9), ఇయాన్ మోర్గాన్ (8) మరో మారు నిరాశపరచగా, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (1) పేలవ ఫామ్ కొనసాగుతోంది. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కేకేఆర్ పరాజయం అప్పుడే ఖాయమైంది.

రసెల్ (16), రాహుల్ త్రిపాఠి (16) కూడా పెవిలియన్ చేరడంతో ఆర్‌సీబీ గెలుపు లాంఛనమే అయింది. కమిన్స్ (1), నాగర్‌కోటి (4), వరుణ్ చక్రవర్తి (7), ప్రసిధ్  (2) పరుగులు చేశారు. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 112/9 వద్ద ముగిసింది. బెంగళూరు బౌలర్లలో మోరిస్, సుందర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సైనీ, సిరాజ్, చాహల్, ఉడానాలు చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఫించ్, పడిక్కల్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసిన ఫించ్.. ప్రసిధ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 94 పరుగుల వద్ద పడిక్కల్ (32) కూడా అవుటయ్యాక డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ సహకారం పూర్తిగా లభించడంతో డివిలియర్స్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్ ఎవరైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న మిస్టర్ 360 వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది.

ఏబీడీ కొట్టిన ఓ బంతి స్టేడియం దాటి రోడ్డుకు ఆవల పడడం అతడి పవర్  హిట్టింగ్‌కు ఉదాహరణ. డివిలియర్స్ దంచుతుంటే కోహ్లీ మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 33 బంతులు ఆడిన ఏబీడీ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, కోహ్లీ 28 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 33 పరుగులు చేశాడు. ఈ విజయంతో కోహ్లీ సేన 10 పాయింట్లతో మూడో స్థానానికి చేరగా, కోల్‌కతా 8 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement