దటీజ్ కోహ్లీ... ధోనీ సేనతో మ్యాచ్ లో ఒంటిచేత్తో జట్టును నిలిపిన ఆర్సీబీ కెప్టెన్!

11-10-2020 Sun 07:19
advertisement

లక్ష్యం పెద్దదేమీ కాదు... కాస్తంత నిలదొక్కుకుంటే భారీ స్కోర్లను రాబట్టగల పిచ్. ఆ విషయాన్ని తన 90 పరుగుల భారీ స్కోర్ తో కోహ్లీ అప్పటికే చూపించేశాడు కూడా... అయినా చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. నిన్న రాత్రి దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టులో ఫించ్ 2 పరుగులకు అవుట్ కాగా, డెవిలియర్స్ డక్కౌట్ అయ్యాడు. దీంతో భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే పడింది. మరో ఓపెనర్ పడిక్కర్ 33 బంతుల్లో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ కూడా నిదానంగా ఆడుతూ ఉండటంతో, 16 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ బోర్డుపై 103 పరుగులు మాత్రమే ఉన్నాయి.

ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. కోహ్లీ తనలోని ఆటగాడిని బయటకు తీశాడు. ఏ బౌలర్ వచ్చినా, బంతిని స్టాండ్స్ లోకి పంపడమే అన్నట్టు ఊగిపోయాడు. కోహ్లీకి చెన్నై బౌలర్లు అడ్డుకట్టను వేయడంలో విఫలం కాగా, 52 బంతుల్లోనే 90 పరుగులు సాధించాడు. 17, 18 ఓవర్లలో 50 పరుగులు రావడం విశేషం. దీంతో 140 వరకూ పరుగులు సాధిస్తుందనుకున్న రాయల్ చాలెంజర్స్ జట్టు 169 పరుగులు సాధించింది.

ఆపై బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టులో ఎవరూ పెద్దగా క్రీజ్ లో నిలకడగా ఉండలేకపోయారు. డూప్లెసిస్ 10, వాట్సన్ 14, జగదీశన్ 33, రాయుడు 42, ధోనీ 10 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ దారి పట్టడంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరు జట్టు నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా, చెన్నై జట్టు మూడు వరుస ఓటములతో 6వ స్థానానికి పడిపోయింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement