నిహారికతో పెళ్లి వార్తలపై వివరణ ఇచ్చిన సినీ హీరో నాగశౌర్య!

01-02-2018 Thu 09:19
advertisement

'ఛలో' సినిమాను చూశానని, విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని సినీ నటుడు నాగశౌర్య తెలిపాడు. ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో నాగశౌర్య మాట్లాడుతూ, ఈ సినిమాపై నమ్మకంతోనే తన తల్లి నిర్మాతగా మారారని చెప్పాడు. సినీ నిర్మాణంలో తన బాబాయ్ బుజ్జి, కజిన్ శ్రీనివాసరెడ్డి చాలా సహకరించారని చెప్పాడు. ఇక తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, తాను నటించిన సినిమాల్లోని కథానాయికలతో తనకు సంబంధాలు ఉన్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని నాగశౌర్య ఆవేదన వ్యక్తం చేశాడు.

‘కళ్యాణ వైభోగమే’ నాయిక మాళవికతో, ‘వూహలు గుసగుసలాడే’ నాయిక రాశీఖన్నాతో, ‘ఒకమనసు’ నాయిక నిహారికతో, ‘జాదూగాడు’ నాయిక సోనారికతో ప్రేమలో ఉన్నట్లు వదంతులు సృష్టించారని పేర్కొన్నాడు. ఇప్పుడు నిహారికతో పెళ్లని కథనాలు వండివారుస్తున్నారని, తొలుత వాటిని పట్టించుకోకపోయినా, ఎంతో కొంత చికాకు పుట్టిస్తాయని నాగశౌర్య పేర్కొన్నాడు.

కథనాలు పేర్కొంటున్నట్టుగా తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని అన్నాడు. తాను కామ్ గా ఉంటానని, ఆడవాళ్లతో మాట్లాడాలంటేనే సిగ్గని చెప్పాడు. మరో మూడు లేక నాలుగేళ్ల తరువాత తన తల్లి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాగశౌర్య తెలిపాడు. తనది ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేమవివాహం కాదని స్పష్టం చేశాడు. 

advertisement

More Flash News
advertisement
..more
advertisement